రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా రెండవ రోజు ఆయన పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. అమెరికాలో అత్యంత అధునాతన వ్యవసాయ క్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన “లాంగ్ వ్యూ ఫార్మ్”ను నిరంజన్ రెడ్డి సందర్శించారు. 1950ల్లో కెన్నెత్, లూయిస్ అనే జంట మొదలుపెట్టిన ఈ వ్యవసాయ క్షేత్రం ఇప్పుడు వారి మునిమనవలైన నాలుగో తరం నడిపిస్తోంది.
నూతన టెక్నాలజీ వినియోగంలో ఎంతో పురోగతి సాధించిన లాంగ్ వ్యూ ఫార్మ్ వ్యవసాయ క్షేత్రంలో జీపీఎస్ ద్వారా ఒక్క సెంటీమీటర్ తేడా లేకుండా విత్తడం, భారీ యంత్రాల సాయంతో దున్నడం నుంచి పంట నూర్పిళ్ల వరకూ పనులు చేయడం, హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా క్రిమిసంహారక మందుల స్ప్రేయింగ్, మొక్క ఎదుగుదలను ప్రతి స్టేజిలో డేటా సేకరించి మానిటర్ చేయడం వంటివి మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు.
ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా జరగనున్న “ఫార్మ్ ప్రోగ్రెస్ షో”ను మంత్రి సందర్శించారు. ప్రపంచవ్యాప్త రైతులు, ప్రముఖ వ్యవసాయ కంపెనీలు, సంస్థలను ఈ అంతర్జాతీయ ప్రదర్శన అనుసంధానిస్తుంది. తెలంగాణ వ్యవసాయం ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం అని మంత్రి వెల్లడించారు.