ఉప్పల్ లో భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్.. ఇంకా తేలని టికెట్ల లెక్క

-

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే టీ20 మ్యాచ్‌ టికెట్ల విషయంలో గందరగోళం నెలకొంది. మరో 24 గంటల్లో మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటివరకు టికెట్ల లెక్కపై ఓ క్లారిటీ లేదు. స్టేడియం సామర్థ్యం 39 వేలు కాగా.. ఇప్పటివరకూ వివిధ రూపాల్లో 26,550 టికెట్లు అయిపోయాయని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహమ్మద్‌ అజహరుద్దీన్‌ వెల్లడించారు. టికెట్ల విక్రయం బాధ్యత పూర్తిగా ‘పేటీఎం’కే అప్పగించామని, జింఖానా ఉదంతంతో హెచ్‌సీఏకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

“ఆన్‌లైన్‌లో టికెట్లు కొని బయట ఎక్కువ ధరకు అమ్మేవాళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. ఈ నెల 15న పేటీఎంలో 11450 టికెట్లు అమ్ముడయ్యాయి. కార్పొరేట్‌ బాక్సుల కోసం 4 వేల టికెట్లు కేటాయించాం. జింఖానాలో 2100 టికెట్లు విక్రయించారు. గురువారం రాత్రి పేటీఎంలో మరో 3 వేల టికెట్లు అభిమానులు దక్కించుకున్నారు. హెచ్‌సీఏ అంతర్గత వ్యక్తులు, వాటాదార్లు, స్పాన్సర్ల కోసం మరో 6 వేల టికెట్లు అందుబాటులో ఉంచాం” అని అజారుద్దీన్ అన్నారు.

పిట్టల రెట్ట, దుమ్ము, ధూళితో నిండిపోయిన కుర్చీలు.. విరిగిపోయిన సీట్లు.. పైకప్పు లేక కళావిహీనంగా స్టేడియం.. ఇదీ ప్రస్తుతం ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ మైదానం పరిస్థితి. ఈ స్టేడియంలో భారత్‌, ఆసీస్‌ టీ20 మ్యాచ్‌కు ఒక్క రోజే సమయం ఉంది. కానీ ఇప్పటికీ మ్యాచ్‌ నిర్వహణ కోసం మైదానాన్ని మెరుగ్గా సిద్ధం చేయడంలో హెచ్‌సీఏ అడుగులు వేయడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version