తెలంగాణలో యూరియా కొరతలేదు.. రైతులకు మంత్రి నిరంజన్ రెడ్డి భరోసా

-

రాష్ట్రంలో యూరియా తగినంత అందుబాటులో ఉందని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అన్నదాతల సౌకర్యార్థం యూరియాతో పాటు అన్ని రసాయన ఎరువులు సరిపడినన్ని ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో వ్యవసాయ శాఖ, జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు.

రాష్ట్రంలో 2లక్షల 18 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ప్రైవేటు డీలర్ల వద్ద 90 వేల మెట్రిక్ టన్నులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద 41 వేల మెట్రిక్ టన్నులు, మార్క్‌ఫెడ్ వద్ద 81 వేల మెట్రిక్ టన్నుల నిల్వ అందబాటులో ఉన్నాయని తెలిపారు. రాబోయే నాలుగు రోజుల్లో  మరో 18 వేల మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని వెల్లడించారు. యూరియా కొరతపై ప్రతిపక్షాల దుష్ప్రచారం నమ్మి కర్షకులు ఎవరూ ఎరువుల కోసం ఆందోళన చెందవద్దని చెప్పారు.

ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని మంత్రి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. గత కొన్నిరోజులుగా రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంత్రి నిరంజన్ రెడ్డి వారి వ్యాఖ్యలపై స్పందిస్తూ యూరియా కొరత వాస్తవం కాదంటూ.. సరిపడా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version