తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. మొన్న అర్ధరాత్రి పూట బాత్రూం లో కేసీఆర్ కాలు జారి పడటంతో తుంటికి గాయమైంది. దీంతో హుటాహుటిన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. సిటి స్కాన్ చేసిన వైద్యులు ఆయనకు ఆపరేషన్ అవసరమని గుర్తించి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు.
సుమారు రెండు గంటలకు పైనే ఆపరేషన్ జరిగింది. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, కేసీఆర్ సతీమణి శోభ సహా కుటుంబసభ్యులంతా ఆసుపత్రిలోనే ఉన్నారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆస్పత్రి దగ్గరే ఉన్నారు. కెసిఆర్ కోలుకునేందుకు ఆరు నుంచి 8 వారాలు పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. యశోద ఆసుపత్రిలో కేసీఆర్ ను జానారెడ్డి పరామర్శించారు. కాగా.. కేసీఆర్ ఆరోగ్యంపై రేవంత్ రెడ్డి కూడా ఆరా తీస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరారు.