దేశ ప్రయోజనాలే బీజేపీ తొలి ప్రాధాన్యత అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు తమ పార్టీ పాల్పడదని తేల్చి చెప్పారు. అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిన విపక్ష పార్టీలు సున్నితమైన అంశాలపై ప్రజలను రెచ్చగొడుతున్నాయంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇన్నాళ్లూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకున్న ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల ముంగిట ఐక్యతాయత్నాల పేరుతో ఫొటోలు దిగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో మంగళవారం నిర్వహించిన ‘మేరా బూత్…సబ్‌సే మజ్‌బూత్’ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు.
“సోనియా గాంధీ కుటుంబ సంక్షేమాన్ని కోరుకుంటే కాంగ్రెస్‌కు ఓటేయండి. కేసీఆర్ కుమార్తె బాగుండాలని కోరుకుంటే బీఆర్ఎస్ ఓటేయండి. ములాయంసింగ్ కుమారుడి అభివృద్ధిని అభిలషిస్తే సమాజ్‌వాదీ పార్టీకి, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు, కుమార్తెలు బాగుండాలంటే ఆర్జేడీకి ఓటేయండి. కరుణానిధి కుటుంబ ప్రయోజనాల కోసమైతే డీఎంకేకి మద్దతివ్వండి. వాళ్లందరూ కాదు… మీ కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు వృద్ధిలోకి రావాలంటే బీజేపీని గెలిపించండి.” అని మోదీ అన్నారు.