పార్లమెంట్ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ప్రజాహిత యాత్రలు, విజయ సంకల్ప యాత్రలు, బస్సు యాత్రలు ప్లాన్ చేస్తోంది. ఈనెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు విజయ సంకల్ప యాత్రలు నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం రంగం సిద్ధం చేస్తోంది. అన్ని యాత్రలు చివరకు హైదరాబాద్‌కు చేరుకునేలా రూట్ మ్యాప్‌ను రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేసింది.
అనివార్య కారణాల వల్ల అన్ని యాత్రలు ఒకే రోజు ముగింపు కుదరకుంటే, బహిరంగ సభను మార్చి 4వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక రూపొందించింది. ముగింపు సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు రాష్ట్ర నేతలు తెలిపారు. విజయసంకల్ప యాత్రలో ఎక్కువ శాతం రోడ్డు షోలు ఉండనున్నట్లు వెల్లడించారు.
ఈ యాత్రను హైదరాబాద్‌లో ముగించాలని భావిస్తున్న నేపథ్యంలో సభ ఎక్కడ నిర్వహిస్తే బాగుంటుందనే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. పరేడ్ గ్రౌండ్ వేదికగా అయితే బాగుంటుందనే ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.