తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లే లక్ష్యంగా బీజేపీ ప్రచార జోరును పెంచింది. ఓవైపు ప్రజాహిత యాత్రలు, మరోవైపు విజయ సంకల్ప యాత్రలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విమర్శలు ఎక్కుపెడుతూ ఎన్నికల రణక్షేత్రంలో దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి జాతీయ నేతలను రప్పిస్తూ కేంద్రం రాష్ట్రానికి దూరం కాదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. ఇటీవలే ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నారు.
ఇక ప్రధాన మంత్రి మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నట్లు రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి. మార్చి 15వ తేదీ నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో మోదీ పర్యటన సాగుతుందని వెల్లడించాయి. ఇందులో భాగంగా ఈనెల 16, 17, 18వ తేదీల్లో మోదీ తెలంగాణలో పర్యటించే అవకాశాలున్నట్లు పేర్కొన్నాయి. మూడు బహిరంగ సభల్లో పాల్గొని లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తామని చెప్పాయి. మోదీ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలుగుతుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అయితే జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజిగిరిల్లో ప్రధాని సభలు నిర్వహించాలని భావిస్తోంది.