తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు బుధవారం ఉదయం గవర్నర్ ప్రసంగం మీద బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నేడు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టే కార్యక్రమం అసెంబ్లీలో నడుస్తున్నది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి గవర్నర్ ప్రసంగాన్ని ‘ఎతుల వెంకటయ్య.. నాలుగు బర్రెల కథ’తో పోల్చారు.
వెనకటికి వెంకటయ్య అనే వ్యక్తి తనకు నాలుగు బర్రెలు లేకపోయినా ఉన్నాయని భావించి ఊర్లో అందరికీ పాలు పోస్తానని చెప్పుకుంటాడని.. ఏ పని చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కూడా గవర్నర్ ద్వారా అన్నిపథకాలు, హామీలు నెరవేర్చినట్లు అబద్ధాలు చెప్పించినదని మాజీ మంత్రి శాసనసభలో ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగం అంతా శుద్ధ అబద్ధమన్నారు. ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ, బోనస్, మహిళలకు రూ.2500, ఆటో కార్మికులకు రూ.12వేలు ఏడాదికి ఎక్కడ ఇస్తున్నారని ప్రశ్నించారు.