వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష మర్డర్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులకు.. ఆమెది ఆత్మహత్యేనేమోనన్న అనుమానం కలుగుతోంది. ఇంట్లో జరిగిన గొడవే ఆత్మహత్యకు పురిగొల్పి ఉంటుందని పోలీసులు భావిస్తున్నా గ్రామస్థులు మాత్రం కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. ఆదివారం వైద్యాధికారిణి వైష్ణవి పర్యవేక్షణలో పోస్టుమార్టం జరిగిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అయితే అక్క భర్త అనిల్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శిరీష మృతదేహాన్ని మరోసారి పరిశీలించాలని పోలీసులు కోరడంతో వైద్యాధికారిణి కాళ్లాపూర్ గ్రామానికి వెళ్లి పరిశీలించారు. ఊపిరితిత్తుల్లోకి నీరు వెళ్లడంతోనే మృతి చెంది ఉంటుందని పోలీసులకు, గ్రామస్థులకు ఆమె వివరించారు. మరోసారి మృతదేహాన్ని పరీక్షించాల్సిన అవసరమేంటని గ్రామస్థులు, బంధువులు పోలీసులను ప్రశ్నించారు. ఇదే సమయంలో తండ్రి జంగయ్యను నిలదీశారు. శిరీష మృతికి ఆయనే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్సై విఠల్‌రెడ్డి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.