తెలంగాణ సర్కార్ వైద్య రంగంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందేలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఒకటిగా నిమ్స్‌ను తీర్చిదిద్దే పనిలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిమ్స్‌లో నూతనంగా నిర్మించనున్న దశాబ్ది బ్లాక్ కొత్త భవనానికి సీఎం కేసీఆర్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 18 వందల పడకలు… 2వేల 200 చేరనున్నాయి. పెరగనున్న పడకలతో నిమ్స్ ఆసుపత్రి పేదలకు మరింత మెరుగైన సేవలు అందించనుంది.
32 ఎకరాల విస్తీర్ణంలో నూతన బ్లాక్ నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. భవన నిర్మాణ బాధ్యతలను సర్కారు ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించింది. నూతన భవన సముదాయంలో కొత్తగా 4 బ్లాక్‌లు అందుబాటులోకి రానుండగా.. అందులో ఓపీ సేవల కోసం ఒకటి, ఐపీ సేవల కోసం రెండు బ్లాక్‌లు, ఎమర్జెన్సీ సేవల కోసం మరో బ్లాక్ అందుబాటులోకి రానున్నాయి. 120 ఓపీ గదులు, సహా 1200 ఆక్సిజన్ బెడ్‌లు, 500 ఐసీయూ పడకలు అందుబాటులోకి రానున్నాయి.