తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అలెర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో కాసేపట్లో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉపరితల చక్రవాత ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఇవాళ దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
మరోవైపు హైదరాబాద్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి నగరం లో వాతావరణం కాస్త చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షం కూడా కురిసింది. నగరంలోని రహదారులన్నీ జలమయ్యాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. అధికారులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
నగరంలో గురువారం రోజున దాదాపు అన్ని డివిజన్లలో వర్షం బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని 148 వర్షపాత నమోదు కేంద్రాల్లో వర్షం కురవడంతో నగరంలోని రోడ్లన్నీ కలమయ్యాయి. పది కేంద్రాల్లో 9-8 సెం.మీ మధ్య వర్షం కురవగా, మరో 12 కేంద్రాల్లో 8-7 సెం.మీ వర్షం కురిసింది.