ప్రజాశాంతి పార్టీ అధినేత కే ఏ పాల్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.సిద్దిపేట జిల్లాలో టిఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా..డిజిపిని కలిసి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు కె ఏ పాల్.అలా డీజీపీ ఆఫీస్ కి వెళుతుండగా ఆయన ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు ఆయనను బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు.శాంతిభద్రతల నేపథ్యంలోనే కే ఏ పాల్ ను హౌస్ అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
కాగా నిన్న రాజన్న సిరిసిల్ల ప్రజలు తంగళ్ల పల్లి మండలం బస్వాపూర్ గ్రామం లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను, నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ హైదరాబాద్ నుంచి బస్వాపూర్ బయలుదేరారు.ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా జక్కాపూర్ వద్ద పోలీసులు కే ఏ పాల్ ను అడ్డుకున్నారు.దీంతో తనను ఎందుకు అడ్డుకుంటున్నారని కే ఏ పాల్ పోలీసులతో వాగ్వాదానికి దిగగా ..ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ వ్యక్తి పాల్ పై దాడి చేశారు.తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని పాల్ డిమాండ్ చేశారు.తనను హత్య చేసేందుకు టిఆర్ఎస్ శ్రేణులు వచ్చాయని ఆయన ఆరోపించారు.