ఖాళీగా ఉన్నాడని తుమ్మలకు మంత్రి పదవి ఇస్తే ప్రజలకు, పార్టీకి ఏం చేయకుండా గుండు సున్నా మిగిల్చారని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలేరు ప్రజా ఆశీర్వాద సభలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై తుమ్మల స్పందిస్తూ.. అప్పట్లో కేసీఆర్‌కు తానే మంత్రి పదవి ఇప్పించానని.. అది మరిచిపోయి ఆయన తనపైనే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు.
పదవుల కోసం తుమ్మల అధమస్థాయికి దిగజారారని పువ్వాడ మండిపడ్డారు. కేసీఆర్ గురించి తుమ్మల ఇష్టారీతిన మాట్లాడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో మంత్రి పదవి ఇచ్చి ఉండకపోతే తుమ్మల ఇప్పటికే రిటైర్ అయ్యేవారని పేర్కొన్నారు. తుమ్మలపై ఆధారపడి కేసీఆర్ అధికారంలోకి వచ్చారా?.. కేసీఆర్‌కు మంత్రి పదవి ఇప్పించినట్లు ఆరోపిస్తున్నారని ప్రశ్నించారు.
‘కేసీఆర్, తుమ్మల ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. కేసీఆర్‌కు తుమ్మల మంత్రి పదవి ఇప్పించారనేది హాస్యాస్పదం. కేసీఆర్ వల్లే తుమ్మలకు మంత్రి పదవి వచ్చింది. తుమ్మల ఓటమికి ఉపేందర్‌రెడ్డికి డబ్బులు ఇచ్చినట్లు ఆరోపిస్తున్నారు. ఆయనకు టికెట్ ఇచ్చి ఓటమి కోసం డబ్బులిస్తారా? టికెట్ ఇచ్చి ఉండకపోతే సరిపోయేది కదా. ఆయన ఎప్పుడూ జైతెలంగాణ నినాదం చేయలేదు. జై తెలంగాణ నినాదం చేసినవారిని తుమ్మల జైలు పాలు చేశారు.’ అంటూ పువ్వాడ అజయ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు.