తెలంగాణలో గ్రూపు-2 పరీక్షలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ గ్రూపు-2లో పరీక్షల్లో పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు పలువురు చర్చించుకోవడం గమనార్హం. ముఖ్యంగా డిసెంబర్ 09న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా నిర్వహించిన గ్రూపు-2 పరీక్ష ప్రశ్న గురించి ఓసారి పరిశీలిద్దాం.
ఈ క్రింది వాటిలో తెలంగాణ తల్లికి సంబంధించి ఏది సరికాదు..? అని ప్రశ్నించారు. దీనికి 4 ఆప్షన్స్ ఇచ్చారు. వాటిలో 1. తెలంగాణ తల్లి విగ్రహ కీరిటం మరియు వడ్డాణంలో కోహినూరు మరియు జాకబ్ వజ్రముల ప్రతిరూపములను కూర్చినారు. 2. ఈమె పాదాల మెట్టేలు కరీంనగర్ ఫిలిగ్రీ వెండితో తయారు చేయబడినాయి. 3. ఈమె గద్వాల్ మరియు పోచంపల్లి చీరలను పోలిన చీరలో ఉంది. 4. ఈమె ఒక చేతిలో బోనమును పట్టుకుంది అని ఆప్షన్స్ ఇచ్చారు. అయితే తెలంగాణ తల్లికి సంబంధించి పాత తెలంగాణ తల్లినా..? కొత్త తెలంగాణ తల్లికి సంబంధించి అడిగారా..? అని అభ్యర్థులు తర్జన భర్జన పడ్డట్టు సమాచారం. దీనికి సంబంధించి TGPSC ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.