తాను బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే తనపై ఎన్నో కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే తన ఇల్లును.. లోక్సభ సభ్యత్వాన్ని లాక్కున్నారని మండిపడ్డారు. అయినా తాను వాటిని సంతోషంగా ఇచ్చేశానని.. దేశంలోని ప్రతి ఇల్లు తనదేనని.. పదవులు కాదు.. ప్రజాసేవే తనకు ముఖ్యమని రాహుల్ స్పష్టం చేశారు. దేశంలో నిజమైన ఓబీసీలు ఎంతమంది ఉన్నారు.. జనాభా ఎంత అనే విషయం మోదీకి, కేసీఆర్కు చెప్పడం ఇష్టం ఉండదని తెలిపారు.
‘బలహీన వర్గాల బడ్జెట్ పై 90 మంది అగ్రవర్ణాల అధికారులే నిర్ణయాలు తీసుకుంటారు. దయ చేసి ప్రజలారా గ్రహించండి.. 90 మంది అధికారుల్లో కేవలం ముగ్గురు మాత్రమే బలహీన వర్గాలకు చెందిన వారున్నారు. ఈ వాస్తవాలు చెప్పడానికి మోదీ, కేసీఆర్లకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మీ జేబులో నుంచి సొమ్ము లూటీ చేసి అదానీ లాంటి వాళ్లకు అప్పగిస్తున్నారు. బలహీన వర్గాల గురించి ఆలోచించే ప్రభుత్వం ఉంటే చక్కెర పరిశ్రమ మూతపడేది కాదు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడగానే కులగణన చేపడుతుంది.. కులగణాన ఎక్స్ రే లాంటిది.. దానితో లోపాలన్నీ బయట పడతాయి. రాష్ట్ర అభివృద్ది కుల గణనతోనే ప్రారంభమవుతుంది. మేమూ సామాజిక తెలంగాణ ఏర్పాటు కావాలనే రాష్ట్రం ఏర్పాటు చేశాం.. కానీ మీ ఆకాంక్ష నెరవేరలేదు.’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.