తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం నేటితో ముగియనున్నందున ప్రధాన పార్టీలు చివరి రోజున ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలు, అభయహస్తం మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జాతీయ నేతలను రంగంలోకి దించింది. గత రెండు మూడ్రోజులుగా ఏఐసీసీ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు రాష్ట్రంలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక ఆఖరి రోజైన ఇవాళ.. కాంగ్రెస్ అగ్రనేతలు సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో తీరిక లేకుండా గడపనున్నారు. జూబ్లీహిల్స్ ఆటోవర్కర్స్, జీహెచ్‌ఎంసీ, గిగ్ వర్కర్స్ యూనియన్లతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. అనంతరం నాంపల్లి నియోజకవర్గంల రోడ్ షో నిర్వహించి.. కార్నర్ సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రియాంక గాంధీ జహీరాబాద్ నియోజకవర్గ ఎన్నికల సభలో పాల్గొని ప్రచారం చేస్తారు.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్‌రెడ్డితోపాటు అగ్రనాయకులు కలిసికట్టుగా హైదరాబాద్ నగరంలో రోడ్ షో నిర్వహించాలని యోచిస్తున్నారు. కంటోన్మెంట్, ఉప్పల్, కుత్భుల్లాపూర్, మల్కాజిరి నియోజకవర్గాలల్లో రోడ్ షోలో పాల్గొని కార్నర్ సమావేశంలో మాట్లాడతారని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తాను పోటీ చేస్తున్న కామారెడ్డిలో చివరి రోజున ప్రచారం చేసేందుకు వెళ్లనున్నారు.