తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం రోజున ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అక్కడక్కడా కురుస్తుందని పేర్కొన్నారు.
ఈ జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం, శనివారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని వెల్లడించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. నగరంలో వర్షాలు కురిసినా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. వరదల వల్ల నగర ప్రజలు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ చర్యల్లో బిజీ అయ్యారు.