అసెంబ్లీలో తమ సమస్యలపై గళం విప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావును ఆటో యూనియన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. శనివారం నగరరంలో హరీశ్ రావును ఆటో యూనియన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా తాము పడుతున్న కష్టాలు, ఆవేదన గురించి వినతిపత్రం సమర్పించారు.కాంగ్రెస్ ఎన్నికలకు ముందు రూ.12 వేలు ఇస్తామని నమ్మించి మోసం చేసిందని వాపోయారు.పార్టీ అధికారంలోకి రాగానే 15 నెలలు గడుస్తున్నా కనీసం రూ.15 కూడా ఇవ్వలేదని మొరపెట్టుకున్నారు.
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆటో డ్రైవర్ల సంక్షేమం గురించి ఊసే లేదని, తమకోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ మాట నిలుపుకోలేదని హరీశ్ రావు దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్థిక సమస్యలతో ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని వాపోయారు. త్వరలోనే తమకు రూ.12వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.