బల్దియా అప్పులపై విజయశాంతి సీరియస్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి ఒక్క రూపాయీ అందకపోవడంతో బల్దియా మళ్లీ అప్పుల వైపు చూస్తోంది. ఇప్పటికే రూ.5,275 కోట్ల అప్పులు చేసిన జీహెచ్ఎంసీ మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమవుతోందని మండిపడ్డారు.
నిధులు కేటాయించాలని ఏటా ప్రభుత్వాన్ని కోరుతున్నా ఫండ్స్ రాకపోతుండటంతో అప్పులు చేసి జీహెచ్ఎంసీని నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో సందర్భంలో ఉద్యోగుల జీతాలు కూడా టైమ్‌కు అందడం లేదు. బల్దియా ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి నయాపైసా రాకపోవడంతో ఆ పనులను పూర్తి చేసేందుకు అప్పులు చేయక తప్పడం లేదన్నారు.
నిధులు ఇవ్వకపోవడంతో పాటు మరిన్ని ప్రాజెక్టులను అమలు చేయాలంటూ ప్రభుత్వం బల్దియాపై భారం పెంచుతోంది. దీంతో జీతాలు ఒకవైపు, మరో వైపు మెయింటెనెన్స్ పనులను చేయడం కూడా బల్దియాకు కష్టంగా మారింది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ), కాంప్రహెన్సివ్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(సీఆర్ఎంపీ) పనులకు నిధుల కొరత ఏర్పడుతుండటంతో జిహెచ్ఎంసి మరోసారి అప్పు చేసేందుకు చూస్తోందని నిప్పులు చెరిగారు విజయశాంతి.
ఒకప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న బల్దియా ఇప్పుడు డైలీ రూ.కోటికి పైగా వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీహెచ్ఎంసీకి బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నప్పటికీ అవి ప్రభుత్వం నుంచి అందడం లేదు. కానీ, సిటీలో పనులు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ అప్పులు చేసి ఆ పనులను పూర్తి చేయాల్సి వస్తోంది. నిధులు కావాలంటూ జీహెచ్ఎంసీ కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని బల్దియా వర్గాలు చెబుతున్నాయన్నారు విజయశాంతి.