నేడు బీఆర్ఎస్​లోకి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల పార్టీ జంపింగ్​లు ఊపందుకుంటున్నాయి. ఓ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా మరో పార్టీలో చేరిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల కీలక నేతలు పార్టీలు మారారు. ఇక ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఇద్దరు సీనియర్ నేతలు చేరబోతున్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిలు ఈరోజు బీఆర్ఎస్​లో చేరనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో రావుల చంద్రశేఖర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సమక్షంలో జిట్టా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

రావుల రాజకీయ ప్రస్థానం గురించి చూస్తే.. వనపర్తి నియోజకవర్గం నుంచి 1994, 2009లలో ఎమ్మెల్యేగా గెలుపొంది.. 1994లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా సేవలందించారు రావుల. 2002 నుంచి 2008 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన రావుల.. 2014లో టీడీపీ తరపున వనపర్తిలో పోటీ చేసి.. ఓడిపోయారు. ఇక ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న రావుల .. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక జిట్టా బాలకృష్ణారెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఆయన సొంతగూటికి చేరుతున్నారు. అప్పటి టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. 2009లో భువనగిరి అసెంబ్లీ టికెట్‌ దక్కకపోవడంతో పార్టీని వీడి.. యువ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత వైసీపీలో చేరి.. గతేడాది బీజేపీలో చేరి.. ఇక ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. ఇక ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్​కు తిరిగి వస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news