పోరుగడ్డ తెలంగాణను తీవ్ర హైటెన్షన్‌లోకి నెట్టేసిన సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ అయితే.. ముగిసినా.. పార్టీల మధ్య మరింత టెన్షన్‌ను.. పెంచేసింది. మరీ ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో గబులు రేపింది. దీనికి కారణం.. గతానికి భిన్నంగా ఇక్కడ ఓటర్లు ఓటెత్తడమే! మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌కు అధికారులు సమయం కేటాయించారు. అయితే, రాత్రి ఏడు గంటల తర్వాత కూడా ఓటర్లు బూతుల వద్ద బారులు తీరికనిపించడం, సాయంత్రం ఆరు గంటలకే రికార్డు స్తాయిలో 75 శాతం పోలింగ్ జరగడంతో దుబ్బాక పోరులో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే విషయం నరాలు తెగే ఉత్కంఠకు దారితీసింది.
సాధారణంగా ఉప ఎన్నికలలో ఇంత భారీ రేంజ్‌లో పోలింగ్ పెరగడం అరుదుగా ఉంటుంది. పైగా ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగితే.. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను బట్టి.. అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకతతోనే ఓటర్లు కదలి వచ్చారనే విశ్లేషణలు ఉన్నాయి. గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు కూడా దీనినే రూఢీ పరిచాయి. దీనిని బట్టి.. దుబ్బాక పోలింగ్ పెరిగిన విధానం.. రాత్రి ఏడు గంటలు దాటిన తర్వాత కూడా ఓటర్లు క్యూలైన్లలో ఉండడాన్ని బట్టి.. అధికార టీఆర్ ఎస్ పార్టీ అంతర్మథనంలో కూరుకుపోయింది. ఉప ఎన్నికలను కూడా ఇక్కడి అధికార పార్టీ సార్వత్రిక ఎన్నికల సమరాన్ని తలపించేలా చేసింది. పెద్ద ఎత్తున మంత్రులను ఇక్కడ మోహరించింది.
ఒక రకంగా చెప్పాలంటే.. మంత్రి హరీష్‌రావు.. ఈ ఉప పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడే మకాం వేసి.. ఆయన ప్రతి విషయాన్నీ అధికార పార్టీకి అనుకూలంగా మార్చుకున్నారు. అదేసమయంలో ప్రధాన ప్రత్యర్థిగా భావించిన బీజేపీపై తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేశారు. ఒకానొక దశలో బీజేపీ గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనే సంకేతాలు వచ్చినప్పుడు అధికార పార్టీ అదుపు తప్పిందనే సంకేతాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి రఘునందనరావు.. కుటుంబ సభ్యుల ఇళ్లలో పోలీసులు దాడులు చేయడం.. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌ను అరెస్టు చేయడం.. రఘునందనరావు నామినేషన్‌ను తిరస్కరించడంతోపాటు.. ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్లు లేవనెత్తడం వంటివి దుబ్బాక ఉప పోరును పీక్ స్టేజ్‌కు తీసుకువెళ్లాయి.
మరోవైపు బీజేపీ కూడా ఈ ఉప ఎన్నికను అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ పర్యటించి, ప్రచారం చేయడం.. తమిళనాడు నుంచి ఐపీఎస్ అదికారిని ఇక్కడ పరిశీలనకు పంపించడం.. వంటివి దుమ్మురేపాయి. ఇన్ని ఉత్కంఠలు.. ఉదృత ప్రచారాల నేపథ్యంలో ముగిసిన దుబ్బాకలో పోలింగ్ శాతం అనూహ్యంగా పెంచేసిన ఓటర్లు అదే ఉత్కంఠను ఇంకా కొనసాగేలా వ్యవహరించారని అంటున్నారు పరిశీలకులు. పోలింగ్ శాతం పెరగడం అంటే.. అధికార పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిదర్శనమని.. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను ప్రజలు పోలింగ్ రూపంలో చెప్పారని అంటున్నారు పరిశీలకులు. దీంతో టీఆర్ ఎస్ నేతల్లో నరాలు తెగే ఉత్కంఠకు తెరలేచినట్టు అయింది.