గత ఎన్నికల్లో గెలిచి పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వారిని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీకి తప్పని పరిస్థితుల్లో ఎల్బీనగర్ టికెట్ ఖరారు చేసినట్లు స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి… ఎంపీ ఎన్నికల్లో తనను ఆదరించిన ఎల్బీనగర్ ప్రజలు మధుయాస్కీని కూడా 30 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్లో నిర్వహించిన ప్రచారంలో రేవంత్ పాల్గొన్నారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ మారి నియోజకవర్గ కార్యకర్తలను మోసం చేశారని.. అభివృద్ధి ముసుగులో సుధీర్ రెడ్డి అభివృద్ధి చెందారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూసీ ఛైర్మన్గా ఉన్న సుధీర్ రెడ్డిని మూసీలో తొక్కాలని అన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై సంతకాలు చేసే బాధ్యతల్లో మధుయాస్కీ కూడా ఉంటారని పేర్కొన్న రేవంత్ రెడ్డి… ఎల్బీనగర్ టికెట్ ఆశించిన స్థానిక నాయకులకు ప్రభుత్వంలోకి రాగానే సముచితమైన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. జోరు వర్షం పడుతున్నా కూడా తన ప్రసంగాన్ని కొనసాగించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.