అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తవటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంపై దృష్టి సారించింది. బహిరంగసభలు, రోడ్‌షోలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. త్వరలోనే జాతీయ నాయకత్వం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనుండగా.. రాష్ట్ర నేతలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నేడు ఖానాపూర్, ఆదిలాబాద్, జహీరాబాద్‌లో రేవంత్ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభల్లో రేవంత్‌రెడ్డి ప్రసంగించనున్నారు.
రేపు పాలకుర్తి, సికింద్రాబాద్, సనత్‌నగర్ సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం సాయంత్రం హైదరాబాద్‌లో జరగనున్న మైనారిటీ డిక్లరేషన్ సభలో పాల్గొననున్నారు. మంగళవారం రోజున ప్రచారం షురూ చేసిన రేవంత్ .. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకే రోజు మూడు చోట్ల జరిగిన బహిరంగసభలకు హాజరయ్యారు. ధరణి రద్దుచేస్తే రైతుబంధు ఆగిపోతుందని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంతకుముందు రైతులకు పథకాలు అందలేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా కేసీఆర్ కుటుంబం కుట్రలు చేస్తోందన్న ఆయన…. తిప్పికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారెంటీలను అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు.