మేడిగడ్డ, అన్నారంపై వస్తున్న వార్తలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్‌అండ్‌టీ సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలకు కేసీఆర్ ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. క్రిమినల్ కేసులు పెట్టడానికి కేసీఆర్ మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. నిర్మాణ సంస్థ వైఫల్యం వల్లే మేడిగడ్డ కుంగిందని సీఎం ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని కేటీఆర్ పదే పదే ప్రశ్నిస్తున్నారని అన్నారు.
‘కాళేశ్వరం అంచనాలపై 2021 డిసెంబర్ 16న ఎంపీ ఉత్తమ్ లోక్‌సభలో ప్రశ్నించారు. 2021లోనే రూ.86 వేల కోట్ల అంచనా ఇచ్చినట్లు ఉత్తమ్ ప్రశ్నకు సమాధానం వచ్చింది. ఎంపీ ఉత్తమ్ ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచారంతో రూ.86 వేల కోట్ల వరకు అంచనాలు పెరిగాయని సమాధానమిచ్చారు. సవరించిన అంచనాల ముసుగులో లక్షా 51 వేల కోట్లకు అంచనాలు పెంచారు. రూ.లక్షా 2 వేల కోట్లు ఖర్చు పెట్టారు.. 50శాతం పనులు పూర్తి కాలేదు. నిర్మాణ, నిర్వహణ, డిజైన్, ప్లానింగ్ లోపం వల్ల రూ.వేల కోట్ల నష్టం రాష్ట్రానికి జరిగింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ ద్వారా నివేదిక తెప్పించాలి. కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక ద్వారా సీబీఐతో విచారణ చేపించాలి. అవకతవకలకు పాల్పడ్డవారిని అరెస్టు చేయాలి.’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.