తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ.. సమానత్వం.. ప్రజాస్వామ్యం కోల్పోయారని.. వారు కోల్పోయిన ఈ మూడింటినీ తిరిగి ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారెంటీ ఇదేనని చెప్పారు. బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఈసారి కాంగ్రెస్‌కు ఓటేద్దామని నిర్ణయించుకున్నారని తెలిపారు. సబ్బండ వర్గాల వారు పోరాడి తెచ్చిన తెలంగాణను కేసీఆర్ చేతుల్లో పెడితే రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం లేకుండా పోయాయని ఆరోపించారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఏడు గ్యారెంటీలు అమలు చేయడమే గాక.. రాష్ట్రంలో అభివృద్ధిని ఆదిలాబాద్ నుంచి మహబూబ్‌నగర్ వరకూ విస్తరిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు . అభ్యర్థులను కాస్త ఆలస్యంగా ప్రకటించినా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏడాదిన్నర నుంచే డిక్లరేషన్లతో ప్రజల్లోకి వెళ్లిందని తెలిపారు. రైతు.. యూత్.. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ల ద్వారా, గ్యారెంటీల ద్వారా ప్రజలకు అందించే సంక్షేమం గురించి చెబుతూ వస్తున్నామని చెప్పారు. ఇక పాదయాత్రలు, బస్సు యాత్రలు, సభలు, సమావేశాలతో ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో అణగారిపోయిన ప్రజలంతా ఇప్పుడు కాంగ్రెస్‌కు ఓటు వేసి పట్టం కడతారని రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.