తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు, అభయహస్తం మేనిఫెస్టోతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఇక ఇవాళ్టి నుంచి పీసీసీ, ఏఐసీసీ నేతలు ప్రచారాన్ని మరింత హోరెత్తించనున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రసంగిస్తున్నారు. ఈ ప్రసంగాల్లో కాంగ్రెస్ వస్తే ప్రజలకు చేసే మేలు ఏంటో వివరిస్తూనే.. తొమ్మిదన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్, అచ్చంపేట, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు. మొదటగా మధ్యాహ్నం 12 గంటలకు వనపర్తి బహిరంగసభలో పాల్గొననున్న రేవంత్ రెడ్డి.. ఈ సభ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు నాగర్కర్నూల్ చేరుకుని అక్కడి సభలో ప్రసంగిస్తారు. ఇక 3.30 గంటలకు అచ్చంపేటలో కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి రేవంత్ మాట్లాడతారు. అనంతరం హైదరాబాద్కు బయల్దేరతారు. సాయంత్రం 6 గంటలకు జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించనున్నారు.