టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. ఆదివారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతులకు ఎప్పుడు కరెంటు కష్టాలేనని విమర్శించారు. 2014 తర్వాత రాష్ట్రాన్ని అన్ని విధాలా కేసీఆర్ అభివృద్ధి చేశారని.. రైతుబంధు లాంటి విప్లవాత్మక పథకాన్ని ఎవరూ తేలేదని గుర్తు చేశారు. దేశంలో మరే రాష్ట్రమైన 24 గంటల విద్యుత్ ఇస్తుందా..? అని ప్రశ్నించారు. మూడు పంటలు బిఆర్ఎస్ విధానం అయితే.. మూడు గంటలు అనేది కాంగ్రెస్ పార్టీ విధానమని ఎద్దేవా చేశారు.
గాంధీభవన్ లో గాడ్సేలా రేవంత్ రెడ్డి తయారయ్యారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని.. ఆయన ఏనాడూ ప్రధాని మోదీని ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడని దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్ పై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కి లేదన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదని.. చంద్రబాబు కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు.