కాంగ్రెస్ సర్కార్ రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దిశగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం సాధారణతోపాటు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారిని కూడా మహాలక్ష్మి పథకం కిందికి తీసుకువస్తోంది. అయితే పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌరసరఫరాలశాఖ పేర్కొంది. ఆ తరువాత రూ.500కు అదనంగా చెల్లించిన ధరను ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ) ద్వారా రీయింబర్స్ చేయాలని నిర్ణయించింది.
ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.40 రాయితీని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.955 ఉంటే.. వినియోగదారుడు చెల్లించాల్సిన రూ.500, కేంద్ర రాయితీ రూ.40 పోను మిగతా రూ.415ని రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.955. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో రూ.974. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రూ.958.50. నారాయణపేట జిల్లా ధన్వాడలో రూ.973.50. ఇలా రాష్ట్రంలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఒక్కోచోట ఒక్కో ధర ఉంది. రవాణా ఛార్జీల వ్యత్యాసమే ఇందుకు కారణం.