సరూర్ నగర్ పరువు హత్య.. ఇద్దరికీ జీవిత ఖైదు విధించిన కోర్టు

-

సరూర్‌నగర్ పరువు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు  శుక్రవారం నాడు సంచలన తీర్పును వెల్లడించింది. 2022 మే 4వ తేదీ రాత్రి సరూర్ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయానికి సమీపంలో  నాగరాజును అత్యంత దారుణంగా హత్య చేశారు దుండగులు.  నాగరాజు భార్య ఆశ్రిన్ సోదరులే ఈ దారుణానికి పాల్పడ్డారు. మతాంతర వివాహం చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో ఆశ్రిన్ సోదరులు ఆమె భర్త నాగరాజును హత్య చేశారు.

రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన  బిల్లాపురం నాగరాజు, ఘణపూర్ గ్రామానికి చెందిన ఆశ్రిన్ సుల్తానాలు  ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. ఆశ్రిన్ సుల్తాన్ కుటుంబ సభ్యులు  నాగరాజును హెచ్చరించారు. అయితే  అదే సమయంలో నాగరాజు ఉపాధి కోసం హైద్రాబాద్ కు వచ్చాడు. హైద్రాబాద్ లోని ఓ కార్ల కంపెనీలో సేల్స్ మెన్ గా పనిచేస్తున్నాడు. 

 2022 జనవరి 31న ఆశ్రిన్ సుల్తానాను ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నాడు. నాగరాజు, ఆశ్రిన్ కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్న విషయం తెలుసుకుని విశాఖపట్టణం పారిపోయారు.  విశాఖపట్టణం నుండి  గత ఏడాది మే మాసంలో హైద్రాబాద్ కు వచ్చారు. అయితే  నాగరాజు,ఆశ్రిన్ హైద్రాబాద్ కు వచ్చిన విషయాన్ని ఆమె సోదరులు తెలుసుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించి నాగరాజు కదలికలను గుర్తించేవారు.  సరూర్ నగర్ నుండి తమ బంధువుల ఇంటికి నాగరాజు, ఆశ్రిన్ బైక్ పై వెళ్తున్న సమయంలో  ఆమె సోదరులు దాడి చేశారు. ఆశ్రిన్  ప్రాధేయపడుతున్నా వినకుండా నాగరాజును హత్య చేశారు.  స్థానికులు ఆశ్రిన్ సోదరులను పట్టుకొని  పోలీసులకు అప్పగించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version