డీలిమిటేషన్‌పై హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల రెండో సమావేశం జరుగనుంది. హైదరాబాద్ వేదికగా రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల నేతల భేటీ ఉండనుంది.. సమావేశం తర్వాత బహిరంగ సభ నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తారు. ఇక దీనిపై త్వరలో తేదీలు ఖరారు చేస్తామని ప్రకటించారు తమిళనాడు సీఎం స్టాలిన్.

ఇక అటు చెన్నైలో జరుగుతున్న డీలిమిటేషన్ సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘డీలిమిటేషన్ మీద ఇప్పుడు మనం ప్రశ్నించకపోతే భవిష్యత్ తరాలు తప్పకుండా ప్రశ్నిస్తాయని అన్నారు. కేసీఆర్ గారు 14 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. మెజార్టీ నియంతృత్వం మందబలం ఉన్నప్పుడు జరిగే నష్టాలు మా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఉద్యమ కాలంలో ఢిల్లీలో ఉన్న మంద బలంతో పాటు సమైక్యరాష్ట్రంలోని మెజార్టీ నాయకత్వం పైన పోరాటం చేసి 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నామని తెలిపారు.