మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. కూలీల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తున్నామని… కుటుంబంలో ఉండే ఉపాధి హామీ మహిళా కూలీ బ్యాంకు ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని జమ చేస్తామని ప్రకటించారు. మహిళా పక్షపాతి ప్రభుత్వం.. అందుకే మహిళల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తున్నామని తెలిపారు. ఇలాంటి పథకాన్ని తీసుకురావడం పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు ఎంతో సంతోషం కలిగించిందన్నారు.
నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ చేతుల మీదుగా కూలీలకు ఆర్థిక చేత అందించడం సంతోషంగా ఉందని వివరించారు. చిన్న పొరపాటు జరిగినాన పేదలకు నష్టం వాటిల్లుతుందని… గ్రామ సభ వేదికగానే అర్హుల గుర్తింపు, లబ్ధిదారుల ఎంపిక జరగాలన్నారు. శాంతియుత వాతావరణంలో గ్రామ సభలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వివరించారు. గ్రామసభ నిర్ణయమే ఫైనల్ అని… గ్రామసభ నిర్ణయాన్ని శిరసావహించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను అమలు చేయాలని పేర్కొన్నారు. మానవీయ దృక్పథంతో, సామాజిక స్పృహతో అధికారులు వ్యవహరించాలని… సాంకేతిక కారణాలతో పేదలకు నష్టం వాటిల్ల లేకుండా చూడాలని వివరించారు. పేదలకు లబ్ధి చేకూర్చేలా, ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా అధికారులు పనిచేయాలన్నారు.