తెలంగాణపై సూరీడు సెగలు కక్కుతున్నాడు. భానుడి భగభగలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా నిప్పుల కొలిమిని తలపించింది. ఆ జిల్లాలోని మునగాలలో 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా గాలిలో తేమ 49 శాతం కన్నా తక్కువ ఉంది. ఇవాళ రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని, గురువారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఎండల ధాటికి అనేకమంది వడదెబ్బ బారిన అస్వస్థతకు గురవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఏడుగురు మృత్యువాత పడ్డారు.
ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిన నేపథ్యంలో వడదెబ్బ ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు తెలిపారు. అనారోగ్యం బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్స్ సహా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. దప్పికతో సంబంధం లేకుండా అవసరమైన నీటిని తాగాలని, ఓఆర్‌ఎస్, నిమ్మరసం, మజ్జిగ, లస్సీ, పళ్లరసాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.