తెలంగాణ కొత్త సచివాలయం పటిష్ఠ భద్రతతో నిత్యం నిఘా అంచున ఉండనుంది. అలాగే సందర్శకుల కదలికల్ని ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూం నుంచి పోలీసులు వీక్షించనున్నారు. సచివాలయం మొత్తంగా దాదాపు 300 వరకు గల సీసీ కెమెరాలను ఈ కమాండ్ కంట్రోల్ రూంకే అనుసంధానించనుండటంతో ప్రతి అంగుళం నిఘానీడలో ఉండనుంది.
మరోవైపు సెక్రటేరియట్ లోపలికి వెళ్లే సందర్శకుల విషయంలో ప్రత్యేక నిఘా అమలులోకి రాబోతోంది. ప్రస్తుతం సందర్శకులు లోపలికి వెళ్లేందుకు మాన్యువల్‌గా ఇస్తున్న పాస్‌ల స్థానంలో డిజిటల్ పాస్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. క్యూఆర్ కోడ్‌తో కూడి ఉండే ఆ పాస్‌లను ప్రత్యేక విధానంలో తయారు చేయనున్నారు.
డిజిటల్ పాస్‌లు పొందిన వ్యక్తులు లోపలికి ప్రవేశించిన తర్వాత ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లేందుకు వీలులేకపోవడమే వాటి ప్రత్యేకత. ఈ సాంకేతికతను రూపొందించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ విభాగం తలమునకలైంది. ఇటీవలికాలంలో బార్‌కోడ్‌ను ట్యాంపరింగ్ చేస్తున్న ఉదంతాలు వెలుగులోకి రావడంతో.. అలాంటి ఘటనలకు ఆస్కారం లేని పరిజ్ఞానాన్ని వినియోగించడంపై దృష్టి సారించింది.