తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై ప్రతిపక్షాలు చేసేది గోబెల్స్ ప్రచారమైతే.. 9 ఏళ్లుగా అబద్ధాల పాలన చేసే మిమ్మల్ని ఏమనాలి హరీష్ రావు గారు? గోబెల్స్ ప్రచారానికి అసలుసిసలు వారసులు మీరు, మీ ముఖ్యమంత్రి అంటూ కేసీఆర్ సర్కార్ పై ఫైర్ అయ్యారు వైఎస్ షర్మిల. బంగారు తునక అని చెప్పి 4.50లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. అంత అప్పు చేసినా రుణమాఫీకి డబ్బు లేదు. డబుల్ బెడ్ రూంలకు డబ్బు లేదు. కొత్త పెన్షన్లకు డబ్బు లేదు. చివరకు జీతాలు ఇవ్వడానికి కూడా దిక్కులేక ఆస్తులు అమ్ముతున్నారు.
మీరు చేసిన అప్పులకు ఏడాదికి రూ.30వేల కోట్ల మిత్తీలే కట్టాలని గుర్తు చేశారు. దేశానికి తెలంగాణ దిక్సూచి అంటే రాష్ట్రాన్ని అమ్మేసి, అంధకారంలో నెట్టేయడమా? 50 లక్షలకు నిరుద్యోగులు పెరగడం ప్రగతి అంటారా? అని నిలదీశారు. 9 ఏళ్లలో ముష్టి 65వేల ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప విషయమా..? ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వలేదు మీ పాలనలో.. ఉద్యోగాలు రాక యువత ఉరికొయ్యలకు వేలాడటం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధా? అని ప్రశ్నించారు. లక్ష రుణమాఫీ అని చెప్పి 30 లక్షల మంది రైతులను మోసం చేశారు. 9 వేల మంది రైతులు ఆత్మహత్యలకు కారణం అయ్యారని నిప్పులు చెరిగారు. నిధులు మీకే,నీళ్ళు మీకే,నియామకాలు మీకే.. ఇదేనా బంగారు తెలంగాణ? 1.20లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే 1.52 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వడం ప్రగతికి అద్దం పట్టినట్లా..? అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.