భానుడు భగ్గుమంటున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను క్రాస్ అవుతున్నాయి. ఎప్రిల్ నెల రాకముందే ఎండలు దంచికొడుతున్నాయి. పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఎండల వేడి, ఉక్కపోతకు సతమతం అవుతున్నారు. పగటి పూట వేడిగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న ఎప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అని ప్రజలు భయపడుతున్నారు.
తాజాగా వాతావరణ కేంద్రం తెలంగాణకు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరుగతాయని హెచ్చిరించింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 41-45 మధ్య నమోదు అవుతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి, జగిత్యాల, భూపాలపల్లి, మంచిర్యాల, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మధ్యాహ్నాలు అత్యవసరం అయితే తప్పా… బయటకు వెళ్లవద్దని సూచించింది. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ 42.3, చప్రాల 42.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.