హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం పెను దుమారం రేపుతోంది. ఈ వ్యవహారం కాస్త కోర్టు మెట్లు ఎక్కింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా.. ఏప్రిల్ 7వ తేదీ వరకు ఆ భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టొద్దంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇక తాజాగా ఇదే అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి.. రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ భూముల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అన్నీ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చి.. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని నిలదీసింది. తమ ప్రశ్నలకు సీఎస్ సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. చెట్లు నరికేసిన స్థలాన్ని పరిశీలించి ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటల వరకు రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.