కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ద్రోహానికి, వంచనకు మారు పేరు కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలను మభ్య పెట్టిందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, సంవత్సరానికి బడ్జెట్ లో రూ.20వేల కోట్లు, బీసీ సబ్ ప్లాన్ అంటూ కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతిపాదించారని గుర్తు చేశారు.
అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా.. ఇందులో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. బడ్జెట్ లో పోయిన సారి రూ.9వేల కోట్లు కేటాయించారు. అందులో సగం కూడా ఖర్చు చేయలేదన్నారు. ఈసారి బడ్జెట్ లో రూ.11వేల కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఏం ఖర్చు చేస్తారో తెలియదని అనుమానం వ్యక్తం చేశారు. కోర్టు చెబితే డెడికేటేడ్ కమిషన్ వేసి కులగణన చేశారు. అది కూడా తప్పుల తడకగా ఉందని.. అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి విస్మరించారు.