తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియలో ఈసారి 80 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలో వృద్ధులు, వికలాంగులు తమ ఓటు హక్కును ఇంటి వద్దే నుంచే వినియోగించుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హైదరాబాద్ ఖాజాగూడలోని ఆయన నివాసంలో సోమవారం రోజున తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు పోస్టల్ బ్యాలెట్‌లో భాగంగా ఇంటి వద్దనే ఓటు వేసే ప్రక్రియను అధికారులు షురూ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో అధికారులు నేరుగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఓట్లు వేయించారు. ముందస్తు సమాచారం అందించి అధికారులు ఓటర్ల ఇళ్లకు వెళ్తున్నారు. ఒకవేళ అధికారులు వెళ్లే సమయానికి ఓటర్లు ఇంటి వద్ద లేకపోతే వారికి మరో తేదీ కేటాయిస్తున్నారు.