తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారని బీఆర్‌ఎస్ పార్టీపై గవర్నర్ తమిళిసై విమర్శలు చేశారు. ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తున్నారు. కాళోజీ మాటలతో గవర్నర్ తమిళిసై తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
ఈ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుందని తెలిపారు గవర్నర్ తమిళిసై. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలను సకాలంలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గత సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశామని ఈ సందర్భంగా పేర్కొన్నారు గవర్నర్ తమిళిసై. తెలంగాణ రాష్ట్రాన్ని పునర్‌నిర్మించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దశాబ్ధకాలంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తామని ప్రకటించారు గవర్నర్ తమిళిసై. TSPSC, SHRC వంటి సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తామన్నారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక సంస్కరణలు చేపడుతున్నామని వివరించారు గవర్నర్ తమిళిసై.