రాష్ట్రంలో రాజకీయ వేడి రోజురోజుకు రాజుకుంటోంది. ముఖ్యంగా ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్, ఇంకోవైపు సీపీఎం పార్టీల ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గంలో ఊసరవెల్లి రాజకీయాలు నడుస్తున్నాయని తమ్మినేని వీరభద్రం ధ్వజమెత్తారు.
“పాలేరు నియోజకవర్గంలో డబ్బుల సంచులతో రాజకీయం నడుస్తోంది. శాసనసభలో మాట్లాడలేని వ్యక్తులకు ఓటు వేయడం నిరుపయోగం, 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ, తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ ఈ నియోజవకర్గంలో ప్రజలకు చేసిందేం లేదు. రాష్ట్రానికి చేసిందేం లేదు. రాష్ట్రంలో అణగారిన వర్గాలు ఇంకా వెనకబడే ఉన్నాయి. ఎన్నికల్లో ఓట్లను డబ్బు పెట్టి కొంటున్నారు. ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలి. ప్రలోభాలకు లొంగకుండా ఐదేళ్ల మీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఓటు హక్కు వినియోగించుకోండి” అంటూ తమ్మినేని విరుచుకుపడ్డారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం మూటపురం, రాజేశ్వరపురం, శంకర్ గిరి తండా, చెన్నారం గ్రామాల్లో తమ్మినేని వీరభద్రం ప్రచారం నిర్వహించారు.