ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన దృష్యా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో తన ప్రచార పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరారు. బయల్దేరిన కొద్దిసేపటికే సీఎం హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్.. సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ల్యాండింగ్ చేశారు.
అనంతరం ఏవియోషన్ సంస్థకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఆ సంస్థ వెంటనే మరో హెలికాప్టర్ పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రత్యామ్నాయ హెలికాప్టర్ రాగానే సీఎం కేసీఆర్ పాలమూరు వెళ్లనున్నారు. కేసీఆర్ పాలమూరు పర్యటన యథావిథిగా కొనసాగనుందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇక కేసీఆర్ రాక కోసం నాలుగు నియోజకవర్గాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల్ నియోజకవర్గ రహదారులన్నీ గులాబీ మయమయ్యాయి. సీఎం సభ కోసం లక్షల మంది కార్యకర్తలు తరలివస్తున్నట్లు.. వారికి అవసరమైన ఏర్పాట్లు చేశామని స్థానిక బీఆర్ఎస్ నేతలు తెలిపారు.