తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. గత ఎన్నికల కంటే కాస్త తక్కువ పోలింగ్ శాతమే నమోదైంది. గురువారం రాత్రి 9.30 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో 70.66 శాతం నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా మునుగోడులో అత్యల్పంగా యాకత్పురా నియోజకవర్గంలో ఓటింగ్ శాతం నమోదైనట్లు వెల్లడించారు. మరోవైపు పోలింగ్ ముగిసిన నేపథ్యంలో అధికారులు ఓట్ల లెక్కింపుపై దృష్టి పెట్టారు.
ఈ క్రమంలోనే కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేయడంలో అధికారులు బిజీ అయ్యారు. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరచారు. ఈనెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా.. దీని కోసం జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఆయా గదుల వద్ద ఆంక్షలు విధించినట్లు వివరించారు.