ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలపై.. నేడు బీజేపీ కీలక భేటీ..!

-

ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు పోలింగ్ పూర్తయిన వేళ ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. తెలంగాణ, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు ఉంటుందని.. మధ్యప్రదేశ్, రాజస్థాన్​లో బీజేపీ.. మిజోరంలో జొరాం పీపుల్స్ మూవ్​మెంట్, మిజో నేషనల్ ఫ్రంట్ మధ్య గట్టి పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఈ అంచనాలపై కొందరు రాజకీయ నేతలు అవిశ్వాసం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై చర్చించేందుకు బీజేపీ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జనరల్‌ సెక్రటరీలతో అధిష్ఠానం కీలక సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలతో పాటు ఆదివారం (డిసెంబరు 3) ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version