విద్యుత్ రంగ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి జెన్‌కో స్థాపిత సామర్థ్యం 4365 మెగావాట్లు ఉందని తెలిపారు. గత ప్రభుత్వం భద్రాద్రి ప్రాజెక్టు మాత్రమే పూర్తి చేసిందని వెల్లడించారు. డిస్కంల ద్వారా వచ్చిన నష్టాలు రూ.62,461 కోట్లు ఉన్నాయని.. 31 అక్టోబర్ 2023 నాటికి రూ. 81,516 కోట్లు అప్పులు అయ్యాయని చెప్పారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికి నాణ్యమైన విద్యుత్ అందిస్తామని భట్టి హామీ ఇచ్చారు.
“విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.28,673 కోట్లు. రోజువారి మనుగడ కోసమే డిస్కంలు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ శాఖలు రూ.వేల కోట్లు డిస్కంలకు బకాయిలు పడ్డాయి. ట్రూ అప్ ఛార్జీలు చెల్లిస్తామన్న గత ప్రభుత్వం మాట తప్పింది. ట్రూఅప్ ఛార్జీలు చెల్లించకపోవడంతో పరిస్థితి దిగజారింది. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికి నాణ్యమైన విద్యుత్ అందిస్తాం. వ్యవసాయానికి నాణ్యమైన, ఉచిత విద్యుత్ అందిస్తాం. రవాణా, సమాచార రంగాల మనుగడకు విద్యుత్ సరఫరా చాలా ముఖ్యం. రాష్ట్ర ప్రజల నాణ్యమైన జీవనశైలిని సూచించేది కూడా విద్యుతే. తెలంగాణ వచ్చాక ఏర్పడిన ఉత్పత్తి ప్రారంభించిన విద్యుత్ కేంద్రాలే నాణ్యమైన విద్యుత్ అందించాయి.” అని భట్టి విక్రమార్క అన్నారు.