కోమటిరెడ్డి బ్రదర్స్‌పై జగదీశ్‌ రెడ్డి ఫైర్

-

కోమటిరెడ్డి బ్రదర్స్‌ విమర్శలపై మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తానెప్పుడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదని అన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం అన్నదమ్ములైన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజగోపాల్ రెడ్డిలకు బాగా అలవాటు అని విమర్శించారు. అవసరాలు, అధికారం, కాంట్రాక్టుల కోసం పార్టీలు మారే వీళ్లా తన గురించి మాట్లాడేది అని మండిపడ్డారు.

“మోటార్లకు మీటర్ల అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. మేం ఇచ్చినట్టు మీరు విద్యుత్‌ ఇస్తే చాలు.. అంతకన్నా గొప్పగా మీరు చేయలేరు. ప్రజలపై భారం వద్దని ట్రూఅప్‌ చార్జీలు ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పాం. అప్పు చేయకుండా, టారిఫ్‌ పెంచకుండా విద్యుత్‌ అందించాలి. గృహాలకు ఉచిత విద్యుత్‌ హామీ నిలబెట్టుకోవాలి. కుంటిసాకులతో హామీలు అమలు చేయకుండా ఉండొద్దు.” అని జగదీశ్ రెడ్డి అన్నారు.

జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తమ గురించి ఆయన అలా మాట్లాడటం ధర్మమా? అని ప్రశ్నించారు. తాను రాజీనామాలు చేసిన తర్వాతే పార్టీ మారానని, అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుందని గుర్తు చేశారు. అభివృద్ధి పేరిట వేల కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version