తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇవాళ జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనున్న భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన తర్వాత ఇందులో నిర్వహించనున్న మొదటి మంత్రివర్గ సమావేశం ఇదే. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక, గవర్నర్ తిరస్కరించిన బిల్లులను తిరిగి ఆమోదించడానికి శాసనసభ సమావేశాలను నిర్వహించడం, రాష్ట్రం ఆవిర్భవించి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ తరుణాన ప్రజలకు మేలు చేకూర్చే ఏదైనా కొత్త పథకం ప్రకటన.. తదితర అంశాలపై చర్చించే అవకాశాలున్నట్లు తెలిసింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ శాసనసభ పక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ ఛైర్మన్లు పాల్గొన్నారు.