తెలంగాణలో ఎన్నికల వేడి షురూ అయింది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే బీఆర్ఎస్ 115 మందితో తొలి జాబితా ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆశావహ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇవాళ్టి నుంచి అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో కీలక ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఇవాళ ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమై ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులతో పాటు 26 మంది ప్రదేశ్‌ఎన్నికల కమిటీ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. 119 నియోజకవర్గాలకు సంబంధించి వెయ్యి మందికిపై దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 34 నియోజకవర్గాలకు 10 కన్నా ఎక్కువ అర్జీలు వచ్చినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. రేవంత్ రెడ్డి పోటీ చేయనున్న కొడంగల్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పోటీ చేయనున్న జగిత్యాల నియోజకవర్గాలకు ఒక్కో దరఖాస్తు వచ్చినట్లు తెలుస్తోంది.