తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 19వ తేదీన హరితహారం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా దశాబ్ది వనాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులకు సేకరించిన భూముల్లో ఖాళీగా ఉన్న 1,007 ఎకరాల్ని ఈ వనాల ఏర్పాటుకు గుర్తించారు. ఇందులో 11 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ బాధ్యతల్ని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో వీటికి ‘దశాబ్ది వనాలు’గా పేరుపెట్టారు.
ఖాళీగా ఉన్న భూవిస్తీర్ణాన్ని బట్టి ఎకరా, మూడెకరాలు, ఇరవై ఎకరాలు.. ఇలా మూడు రకాల విస్తీర్ణంతో బ్లాక్‌లు ఏర్పాటుచేసి పండ్లు, కలప మొక్కల్ని నాటనున్నట్లు అధికారులు తెలిపారు. మొక్కల రక్షణకు తక్కువ విస్తీర్ణం బ్లాక్‌ల చుట్టూ కంచె నిర్మాణం, పెద్ద బ్లాక్‌ల చుట్టూ కందకాలు తవ్వాలని నిర్ణయించారు. చుట్టూ కందకం తవ్వినచోట గచ్చకాయ, సీతాఫలం వంటి మొక్కలు నాటనున్నారు. ఈ నెల 19న దశాబ్ది వనాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.