కొత్తగా పెళ్లైన మహిళలకు తెలంగాణ సర్కార్ శుభవార్త. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చేస్తామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. లబ్దిదారుల ఎంపికపై అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఇంఛార్జ్ మంత్రులు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు.
ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. జనవరి 20-24 మధ్య వార్డుల వారీగా ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని వివరించారు. 21 నుంచి 25 మధ్యలో డేటా ఎంట్రీ పూర్తి కానుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అర్హులైన లబ్ధి దారులకు అందరికీ రేషన్ కార్డులు అందుతాయి..గత పదేళ్లుగా రేషన్ కార్డులు విడుదల కాలేదని గుర్తు చేశారు. పెళ్ళైన మహిళలు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్లిన వాళ్లకు పేర్లు మార్చునే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు పొన్నం.