రాష్ట్ర ప్రజలకు గుడ్న్యూస్. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను పెంచుతూ తాజాగా రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా 163 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయా జీవోలను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విడుదల చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 1,672 చికిత్సలు ఉండగా వీటిలో 1,375కు సంబంధించిన ప్యాకేజీలను పెంచగా.. మరో 297 చికిత్సల ధరలను యథాతథంగా ఉంచినట్లు ఉత్తర్వుల్లో వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
సామాన్య ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. పెరిగిన ప్యాకేజీలు, కొత్తగా చేర్చిన చికిత్సలతో ఏటా ప్రభుత్వంపై రూ.600 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన ప్యాకేజీ ధరలే ఇప్పటి దాకా అమలయ్యాయని.. 11 ఏళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే పెంచిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతం చేశామని చెప్పారు.